`ఖైదీనంబ‌ర్ 150` మూవీ రివ్యూ

0

chirureview-fifthshow

రిలీజ్‌ తేదీ : 11-01-2017
జోన‌ర్‌: కామెడీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌
మాస్టార్స్ రేటింగ్ : 3.7 /5

న‌టీన‌టులు: మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్‌, త‌రుణ్ అరోరా, త‌దిత‌రులు..
నిర్మాత : రామ్‌చ‌ర‌ణ్‌
బ్యాన‌ర్ : కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ
సంగీతం : దేవీశ్రీ ప్ర‌సాద్‌
కెమెరా: ర‌త్న‌వేలు
ద‌ర్శ‌క‌త్వం: వి.వి.వానాయ‌క్‌
ఇత‌ర సాంకేతిక వ‌ర్గం: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, స‌త్యానంద్‌, బుర్రా సాయిమాధ‌వ్, వేమారెడ్డి త‌దిత‌రులు

ముందు మాట‌:
దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారంటే ప్ర‌పంచ‌మంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూసింది. వ‌ర‌ల్డ్‌వైడ్ మెగాభిమానుల్లో, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో, కామ‌న్ ఆడియెన్‌లో ఒక‌టే ముచ్చ‌ట‌. బాస్ వ‌స్తే ఆ కంబ్యాక్ మూవీ ఎలా ఉండాలి? బాస్ ఈజ్ బ్యాక్ అని ప్రూవ్ చేసే సినిమాతోనే రావాలి.. అంటూ ముచ్చ‌టించుకున్నారు. మ‌ళ్లీ ఓ ఘ‌రానామొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్‌లీడ‌ర్‌లా బాస్ క‌నిపిస్తాడా? క‌నిపించే రేంజు సినిమా చేస్తాడా? అని అత్యంత ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు. ఠాగూర్ లాంటి రికార్డ్ హిట్ మూవీని బాస్‌కి ఇచ్చిన వి.వి.వినాయ‌క్‌ను బ‌రిలో దించి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స్వ‌యంగా.. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని `క‌త్తి` సినిమాని `ఖైదీనంబ‌ర్ 150` పేరుతో రీమేక్ చేస్తున్నారని తెలిశాక అంద‌రిలోనూ అంచ‌నాలు చుక్క‌ల్ని తాకాయి. అందుకు త‌గ్గ‌ట్టే తొలి పోస్ట‌ర్ నుంచి, టీజ‌ర్‌ నుంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. దేవీశ్రీ ఆడియో ఆ హైప్‌ని మ‌రింత పీక్స్‌కి తీసుకెళ్లింది. ఏదైతేనేం బాస్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశారు. సంక్రాంతి పండుగను వారం ముందే తెలుగు లోగిళ్ల‌లోకి తెచ్చారు. అన్ని అంచ‌నాల న‌డుమ రిలీజైన `ఖైదీనంబ‌ర్ 150` ఆ అంచ‌నాల్ని చేరుకుందా? లేదా? అంత గ్యాప్ త‌ర్వాత బాస్ తెర‌పై ఎలా క‌నిపించారు? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే.

సింగిల్ లైన్ స్టోరి:
బాగా డ‌బ్బు వెన‌కేసుకుని బ్యాంకాక్ చెక్కేసి, అక్క‌డ‌ బ్యాలెన్స్ లైఫ్‌ని లీడ్ చేసేయాల‌నుకున్న ఓ దొంగ (క‌త్తి శీను) జీవితం అనుకోని ట్విస్టుతో ఏ కంచికి చేరింది? అన్న‌దే సింగిల్ లైన్ స్టోరి.

స‌బ్ ప్లాట్‌:
లైఫ్ లీడ్ చేయాలంటే డ‌బ్బు సంపాదించాలి. అది దొంగ‌త‌న‌మైనా, మోసం చేసైనా.. అనుకునే దొంగ శీనుకు
శంక‌ర్ అనే జెంటిల్మ‌న్ ప‌రిచ‌యం అయ్యాక అత‌డి జీవితం ఎలా మారిపోయింది? దొంగ‌శీనులో ప‌రివ‌ర్త‌న (రియ‌లైజేష‌న్‌) ఏంటి? అస‌లు ఈ క‌థ‌లో అస‌లు శంక‌ర్ ఎవ‌రు? శ‌ంక‌ర్‌తో క‌త్తి శీను ముడి ఏంటి? శంక‌ర్‌కి రైతుల‌కు ఉన్న లింకేంటి? రైతు ఆత్మ‌హ‌త్య‌లు.. భూముల దురాక్ర‌మ‌ణ .. కార్పొరెట్ గేమ్ .. వీట‌న్నిటి క‌థాక‌మామీషు ఏంటి అన్న‌దే సినిమా.

క‌థా క‌మామీషు:
క‌త్తిశీను (చిరంజీవి) మ‌హా ఆక‌తాయి దొంగ‌. అల్ల‌రి దొంగ‌. మంచి దొంగ‌. దొంగ‌ల‌కు దొంగ‌. వీట‌న్నిటినీ మించి రొమాంటిక్ దొంగ కూడా. ఇన్నిర‌కాల క్వాలిఫికేష‌న్స్ ఉన్నాయి కాబ‌ట్టి క‌ల‌క‌త్తా జైల్‌లో సోగ్గా ఎంట్రీ ఇస్తాడు క‌త్తి శీను. దొంగ‌ను దొంగతోనే కొట్టాలి.. అన్న‌ సూత్రం ప్ర‌కారం.. జైల్లోంచి త‌ప్పించుకు పారిపోతున్న‌ గ‌జ కంత్రీ గాడిని ప‌ట్టుకునేందుకు ఈ మంచి దొంగకే ఆ ప‌ని పుర‌మాయిస్తాడు జైల‌ర్. క‌ట్ చేస్తే గ‌జ‌కంత్రీగాడిని ప‌ట్టిచ్చి, అట్నుంచి అటే శీనుగాడు జంపు. అక్క‌డి నుంచి డైరెక్టుగా హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో దిగిపోతాడు క‌త్తిశీను. బ్యాంకాక్ చెక్కేసేందుకు పాస్‌పోర్ట్ రెడీ చేయించుకుని వెళుతుండ‌గా అస‌లు ట్విస్టు. కొంద‌రు దుండ‌గులు ఆటోలో పంట స‌రుకుతో సిటీవైపు వ‌స్తున్న శంక‌ర్‌(చిరంజీవి)పై ఎటాక్ చేస్తారు. ఆ ప్ర‌మాదం నుంచి శంక‌ర్‌ని ర‌క్షించిన శ్రీ‌ను… అదే శంక‌ర్ వ‌ల్ల బోలెడంత డ‌బ్బు దోచుకుని జేబులో వేసుకునే ఛాన్సుంద‌ని తెలుసుకుని శంక‌ర్ న‌డిపిస్తున్న వృద్ధాశ్ర‌మానికి వ‌స్తాడు. ఆశ్ర‌మంలో అడుగుపెట్టిన క‌త్తి శీనుకు `క‌త్తి`లాంటి ఒక్కో నిజం తెలిసొస్తుంటాయి. అస‌లు శంక‌ర్ ఎవ‌రు? అత‌డు కేసులు, గొడ‌వ‌లు అంటూ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? వృద్ధాశ్ర‌మంతో శంక‌ర్ లింకేటి? రాయ‌ల‌సీమ‌లోని నీరూరు క‌థేమిటి? అక్క‌డ రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మేంటి? రైతుల పంట పొలాల్ని లాక్కుని కోలా కంపెనీ పెట్టాల‌నుకున్న కార్పొరెట్ గాళ్ల కుయుక్తులేంటి? కార్పొరెట్ దందాలేంటి? ఈ దందాల నుంచి రైతుల్ని, వారి భూముల్ని కాపాడేందుకు దొంగ‌ల‌కు దొంగ, మోస‌గాళ్ల‌కు మోస‌గాడు లాంటి క‌త్తి శీను ఏం చేశాడు? ఈ క‌థ‌లో ల‌క్ష్మి(కాజ‌ల్‌) క‌థేమిటి? క‌త్తిశీను-ల‌క్ష్మి మ‌ధ్య రొమాన్స్ సంగ‌తేంటి? వీట‌న్నిటికీ స‌మాధానం కావాలంటే థియేట‌ర్ల‌లో సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌& పెర్ఫామెన్సెస్‌:
ఎస్… నిస్సందేహంగా బాస్ ఈజ్ బ్యాక్‌. సినిమా ఆద్యంతం బాస్ చిరంజీవి మెరుపులే మెరుపులు. ఎనిమిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ఈయ‌నేం చేస్తాడులే! అనుకున్న‌వాళ్ల‌కు ప్రాక్టిక‌ల్‌గా స‌మాధానం చెప్పారు మెగాస్టార్. త‌న‌కి మాత్ర‌మే సూట‌య్యే క‌థ‌ని ఎంచుకుని.. 149 సినిమాల అనుభ‌వాన్ని రంగ‌రించి 150వ సినిమాలో క‌త్తి శీను, శంక‌ర్ (డ్యూయ‌ల్‌) పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు బాస్‌. ఆ స్టెప్పులేంటి? ఆ ఫైట్స్ ఏంటి? ఆ ఆహార్యం ఏంటి? న‌భూతోన‌భ‌విష్య‌తి అని పొగ‌డాల్సిందే. బాస్ న‌ట‌న‌కు నూటికి 200 శాతం మార్కులు వేస్తే త‌క్కువే. అవే మ్యాన‌రిజ‌మ్స్‌. అవే మేనివిరుపులు.. థియేట‌ర్ల‌లో ఈల‌లు.. కేక‌లు.. ఘ‌రానామొగుడు బ‌రిలోకొచ్చాడా? గ‌్యాంగ్‌లీడ‌ర్ మ‌ళ్లొచ్చాడా? రౌడీ అల్లుడు గేర్ మార్చాడా? వార్ వ‌న్‌సైడ్ అయిపోయిందే.. అన్న‌ట్టే బాస్ క‌నిపించారు. ఆ బాడీ లాంగ్వేజ్‌లో ఎక్క‌డా టింజ్ త‌గ్గ‌లేదు. గ్రేస్ ప‌తాక‌స్థాయిలో చూపించారు చిరు. ఆ ఫేస్‌లో ఎక్స్‌ప్రెష‌న్స్ ప‌లికించిన తీరు, డ్యాన్సుల్లో శ‌రీరాన్ని విల్లులా వొంచిన వైనం.. ఒక్కో పాట‌లో బాస్ వేసిన స్టెప్పులు థియేట‌ర్ల‌లో అరిపించాయి. ప్రేక్ష‌కాభిమానుల కేరింత‌ల‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయాయి. ఈ దెబ్బ‌తో మెగాస్టార్ స్టామినా ఏంటో మ‌రోసారి తెలిసొచ్చింది. అబ్బ‌బ్బ! చిరంజీవి లాంటి సీనియ‌ర్ స‌ర‌స‌న చంద‌మామ‌ సూట‌వుతుందా? అన్న‌వారికి స‌మాధానంగా చిరంజీవి – కాజ‌ల్ మ‌ధ్య రొమాన్స్ సెట్టయ్యింది. చిరు శ‌రీర‌భాష‌లో మేకోవ‌ర్ చూస్తే అస‌లు కాజ‌ల్ ఏంటి? నిన్న‌గాక మొన్న బ‌రిలోకొచ్చిన టీనేజీ అమ్మాయి అయినా సూట‌బుల్ అని ఎవ‌రైనా అంగీక‌రించాల్సిందే. చిరు కొత్త లుక్‌.. చూస్తే వ‌య‌సు 20 ఏళ్ల వెన‌క్కి వెళ్లిందని అంగీక‌రిస్తారు ఎవ‌రైనా. స‌రిగ్గా ఎలాంటి సినిమాతో కంబ్యాక్ అవ్వాలో అలాంటి సినిమాతో బాస్ మ‌ళ్లీ వ‌చ్చారు. ఈ సినిమాలో యూనివ‌ర్శ‌ల్ అనిపించే క‌థాంశం ఉంది. రైతు ఆత్మ‌హ‌త్య‌లు, భూక‌బ్జాలు అనేవి ఆల్‌టైమ్ బ‌ర్నింగ్ టాపిక్స్‌. అందుకే ఈ స‌బ్జెక్టును బాస్ ఏరి కోరి ఎంచుకున్నార‌ని విజువ‌ల్‌గా చూశాక ఒప్పుకుని తీర‌తారు. ఇక కాజ‌ల్ త‌న పాత్ర‌లో ఒదిగిపోయి న‌టించారు. సుబ్బ‌ల‌క్ష్మి అంటూ క‌త్తిశీను వెంట‌ప‌డేప్పుడు కాజ‌ల్ బుగ్గ‌ల్లో నిగ్గులు చూడాల్సిందే. అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు సాంగ్‌లో కాజ‌ల్ డ్యాన్సులు హైలైట్‌. విల‌న్ పాత్రధారి త‌రుణ్ అరోరా కార్పొరెట్ గ్యాంబ్ల‌ర్‌గా సూట‌బుల్ పాత్ర‌లో న‌టించారు. ఇక ఈ మూవీలో అలీ, బ్ర‌హ్మానందం, పోసాని కామెడీ పార్ట్ మ‌రో హైలైట్‌. మెగాస్టార్ వెంటే వుండి అలీ పండించిన కామెడీ, క‌నిపెడ‌తా అంటూ అడ్డంగా బుక్క‌యిపోయే బ్ర‌హ్మీ కడుపుబ్బా న‌వ్వించారు. కార్పొరేట‌ర్ ఫాద‌ర్‌గా పోసాని అద్భుత‌మైన కామెడీ పండించారు. అలాగే ల‌క్ష్మీరాయ్ స్పెష‌ల్ సాంగ్ ర‌త్తాలు కిక్కెక్కించింది. ఇక రైతు ఆత్మ‌హ‌త్య‌ల స‌న్నివేశం.. వృద్ధుల‌పై రౌడీల దౌర్జ‌న్యం స‌న్నివేశాలు కంట‌త‌డి పెట్టిస్తాయి. ఇక శంక‌ర్ పాత్ర ఆద్యంతం ఉద్వేగాన్ని ర‌గిలిస్తుంది. ఆర్ద్ర‌త‌ను నింపుతుంది. క‌త్తిశీనులో రొమాంటిక్ యాంగిల్ క‌న్నెమ‌న‌సుల‌కు గిలిగింత‌లు పెట్టేస్తుంది. వీట‌న్నిటినీ మించి మెగాస్టార్ చిరంజీవి-మెగాప‌వ‌ర్‌స్టార్ చ‌ర‌ణ్ ఓ సాంగ్‌లో ఒకే ఫ్రేములో స్టెప్పులు క‌లిపి మెగాఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీటిచ్చారు.
ఏ మాటకామాట చెప్పుకుంటే ఈ సినిమాలో అన్నివ‌ర్గాల‌ ఆడియెన్‌కి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. కామెడీ, రొమాన్స్‌, యాక్ష‌న్‌, సెంటిమెంట్, ఎమోష‌న్‌, థ్రిల్‌.. ఇలా అన్నీ నూటికి నూరు పాళ్లు సెట్ట‌య్యాయి. ఇక రోమాలు నిక్క‌బొడుచుకునే స‌న్నివేశాలు.. వాటికి స‌రిప‌డే ఇన్‌డెప్త్ డైలాగులు ఈ సినిమాలో మ‌రో హైలైట్‌.

టెక్నిక‌ల్ విభాగం :
ఈ సినిమాకి అన్నీ తానే అయ్యారు వి.వి.వినాయ‌క్‌. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల రారాజు వినాయ‌క్ ఈజ్ బ్యాక్‌.. అని మ‌రోసారి నిరూపించుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డుల్ని తిర‌గ‌రాసే స‌త్తా ఉన్న సినిమాని వినాయ‌క్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. నాడు `ఠాగూర్` ఎలాంటి సంచ‌ల‌న‌మో.. ఇప్పుడు ఖైదీనంబ‌ర్ 150 అంత‌కుమించిన సంచ‌ల‌నం అవ్వ‌డం వెన‌క వినాయ‌క్ కృషి విస్మ‌రించ‌లేనిది. ఒక్కో ఫ్రేమ్‌ని అత‌డు తీర్చిదిద్దిన తీరు.. మెగాస్టార్‌ని రెండు పాత్ర‌ల్లో ఆవిష్క‌రించిన తీరు అన‌న్య‌సామాన్యం. వినాయ‌క్ శ్ర‌మ ప్ర‌తి స‌న్నివేశంలో కనిపించింది. ఇది నా త‌మ్ముడు, నా అభిమాని తీసిన సినిమా అని మెగాస్టార్ ప్రీరిలీజ్‌లో అంత‌గా ప్ర‌శంసించారంటే అందుకు కార‌ణం ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక‌ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నిర్మాణ విలువ‌లు, రామ్‌చ‌ర‌ణ్‌లోని రాజీలేని త‌త్వం క‌నిపించాయి. విజువ‌ల్ రిచ్‌గా ఈ సినిమాని చూపించిన తీరు పెద్ద అస్సెట్ అయ్యింది. షాట్స్‌లో, పాట‌ల్లో విజువ‌ల్ గ్రాండియారిటీ వెన‌క ర‌త్న‌వేలు క‌మెరా ప‌నిత‌నం ప‌క్కాగా క‌నిపించింది. రాక్‌స్టార్ దేవీశ్రీ ఈజ్ బ్యాక్‌. దేవీశ్రీ పాట‌లు, రీరికార్డింగ్ సినిమాకి ప్రాణం పోశాయి. ఇక ఈ సినిమాలో మాట‌లు అంత బ్యాలెన్స్‌డ్‌గా కుదిరాయంటే సీనియ‌ర్ ర‌చ‌యిత‌లు స‌త్యానంద్‌, ప‌రుచూరి సోద‌రులు వీళ్ల‌తో పాటే బుర్రా సాయిమాధ‌వ్, వేమారెడ్డి వంటి న‌వ‌త‌రం ర‌చ‌యిత‌లు ఉన్నారు కాబ‌ట్టే.

ముగింపు:
బాస్ ఈజ్ బ్యాక్‌.. థియేట‌ర్ల‌లో సంక్రాంతి సంబ‌రాలే. ప్రీక్రిటిసిజ‌మ్‌కి చెంప‌పెట్టు-`ఖైదీనంబ‌ర్ 150`.. ఎట్ట‌కేల‌కు బాస్ పంతం నెగ్గించుకున్నారు.

రేటింగ్‌: 3.7 / 5

Share.

Leave A Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com